కరోనా కల్లోలం.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. తాజాగా మూడు లక్షల మార్క్‌ను కూడా దాటేసిన పాజిటివ్ కేసులు.. ఒకేరోజులో ఏకంగా 3.14 లక్షల కేసులతో ఏకంగా ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది.
అయితే, ఈ తరుణంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు, దేశంలో ఆక్సిజన్, ముఖ్యమైన మందులు, వ్యాక్సిన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా, వివిధ రాష్ట్రాల్లోని ఆరు హైకోర్టుల్లో కోవిడ్‌కు సంబంధించిన కేసులు విచారణలో ఉన్నాయి.. ఆక్సిజన్, బెడ్ల కొరత్, వ్యాక్సిన్ కొరత, రెమ్డెసివివర్, ఇలా పలు అంశాలపై హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు కాగా, వాటిని ఆయా కోర్టులు విచారిస్తున్నాయి.
అయితే, ఇవాళ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే కోవిడ్ మహమ్మారికి సంబంధించిన కేసులపై స్పందిస్తూ, వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని వ్యాఖ్యానించారు.
కోవిడ్‌కు మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్రానికి హితవుపలికిన ఆయన, ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించారు.
ఇక, లాక్‌డౌన్‌ను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం జరుగుతున్నదంతా గందరగోళంగా, అయోమయంగా ఉందని అసంతసృత్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, వనరుల దారి మళ్లింపు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇటాంటి సమస్యలపై కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ను నియమించారు. ఇక, తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.