కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
శ్రీకాకుళం, మే 9 : రాష్ట్రంలో ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.
ఆదివారం శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పలు అంశాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో చేతులెత్తేసిందని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని ఇందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేయడం జరుగుతొందని ఆయన పేర్కొన్నారు. రైతు పంట బీమాకు ఇటీవల టు.2,500 కోట్లు, రైతు భరోసా రూ.3,500 కోట్లు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమం, విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల క్రింద వేలాది కోట్లను జమ చేసిన సంగతిని గమనించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజలందరికీ కోవిడ్ వాక్సిన్ అందించేందుకు రూ.16 వందల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని, దీనిని ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
వాక్సినేషన్ కోసం విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రూ.16 వందల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడదని మంత్రి పేర్కొన్నారు.
ఏప్రిల్ 24వ తేదీన రాష్ట్రానికి నాలుగున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేయాలని వ్యాక్సిన్ కంపెనీలకు లేఖ రాయడం జరిగిందని ఆయన చెప్పారు.
జిల్లాలో కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోనుటకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, 2,400 పడకలు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.