ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు
వాతావరణ నిపుణుల అంచనా.. అరేబియాలో అనుకూల వాతావరణం
రేపు అల్పపీడనం: ఇస్రో అంచనా
కరోనా ఉగ్రరూపానకి భానుడి ప్రతాపం తోడై ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లని కబురు అందించింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువు, అంటే జూన్ ఒకటో తేదీ కంటే ముందే వస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని అరేబియా సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వచ్చే రెండు, మూడు రోజుల్లో ఋతుపవనాలపై స్పష్టత వస్తుందని ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి ఆదివారం వాయుగుండంగా మారుతుందని వివరించారు.
తరువాత ఉత్తర వాయువ్యంగా పయనించి తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ప్రవేశించి మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని పేర్కొన్నారు.
ఇది తుఫాన్‌గా మారిన తరువాత గుజరాత్ మరియు పాకిస్థాన్ తీరం దిశగా పయనిస్తుందని అంచనా వేశారు.
తుఫాన్ బలహీనపడిన తరువాత కూడా అరేబియా సముద్రంలో పరిస్థితులు ఋతుపవనాలకు అనుకూలంగా కొనసాగుతాయని విశ్లేషించారు.
నేడు, రేపు వర్షాలు
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో కడప జిల్లాలో 6 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది.