పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం
పాము కాటేసిందని ఆసుపత్రికి వస్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్‌ను వేసారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే భరత్ రెడ్డి అనే యువకుడు ఈ నెల 2వ తేదీన పాము కాటేయడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు.
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిపక్షన్‌ను చూపి చికిత్స చేయవలసిందిగా సిబ్బందిని కోరాడు.
అయితే ప్రిస్క్రిపక్షన్‌ను సరిగా పరశీలించని సిబ్బంది పాము కాటు ఇంజక్షన్‌కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్‌ను ఇచ్చి, రెండో డోసుకు 5వ తేదీ రావాలని సదరు యువకుడికి సూచించారు.
సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడికి అనుమానం కలిగి పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్ ఇస్తారు కదా అని నిలదీశాడు.
దానికి బదులుగా సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడు అవాక్కయ్యాడు.
పాము కరిచిందని వస్తే కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ ఇస్తారా అని సిబ్బందిపై మండిపడ్డాడు.
బాధితుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
సిబ్బంది నిర్వాకానికి షాక్‌కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.