ప్రభుత్వ ఆసుపత్రి ఓ.పి సేవలు నిర్వహించాలి, జీవన మరణ సమస్యగా మారిన ఓ.పి సేవలు
సబ్ కలెక్టర్ కార్యాలయం లో వినతిపత్రం అందజేసిన కురువెళ్ల భానుచందర్, కంది కొండరమేష్
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి.
ప్రభుత్వ ఆసుపత్రి ప్రాణదాత మరియు దేవాలయంలా భావించే పేద మధ్య తరగతి రోగులకు మరియు సామాన్య ప్రజలకు వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సంఘ నాయకుడు సామాజికవేత్త కందికొండ రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రోగిని పరీక్ష చేసి వ్యాధినిర్ధారణ చేసుకుని వ్యాధి తీవ్రతను పరిశీలించి ఈ వ్యాధి మందులతో నయం అవుతుంది అని తెలియజేస్తే, వారంలో చనిపోతారు అనేవారు కూడా సంవత్సరాల కాలం బ్రతుకుతారు అని, నిజానికి ఆ మందులలో లేని శక్తి డాక్టర్ నోటినుండి వెలువడే మాటకు ఉంటుందని, నీకు ఏమీ కాదు ధైర్యంగా ఉండు అని డాక్టర్లు అంటే చాలు అని ప్రభుత్వ ఆసుపత్రి ఉండబట్టే రోగి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుందని అన్నారు.
సామాజిక వేత్త మరియు జై భీమ్ సేన ఉద్యమ సంఘ రాష్ట్ర చైర్మన్ కురువెళ్ల భానుచందర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా వైరస్ కారణంగా కోవిడ్ ఆస్పత్రిగా మార్చడం జరిగింది.
దీనివల్ల నిత్యం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులు వైద్యం కోసం అక్కడికి వచ్చే పేద మధ్య తరగతి ఉద్యోగులు ఆందోళన గురవుతున్నారని అన్నారు.
ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేని వారు అక్కడ డాక్టర్ కన్సల్ట్ ఫీజు ఏకంగా 500 నుండి వెయ్యి రూపాయల వరకు ఉండటంతో వైద్యం అందని ద్రాక్షగా మారిందని అన్నారు.
ఈ రోజుల్లో దానికితోడు కరోనా టెస్టులు లేనిదే డాక్టర్ చూడట్లేదు అని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ.పి నిర్వహణ ఆపడం పేద ప్రజలకు జీవన మరణ సమస్యగా మారుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ వారు జిల్లా కలెక్టర్ వారు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త బలరామ నాయుడు, సామాజిక వేత్త హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ ధర్నాలకోట వెంకటేశ్వరరావు, ది గోదావరి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ డి.ఎం.డి అబ్దుల్ రాజాక్ తదితరులు పాల్గొన్నారు.