నమ్మి గెలిపించినప్పుడు ప్రాణాలకు తెగించి పని చేయాలి – పతివాడ రాణి
గత ఏడాది కంటే కరోనా నివారణా చర్యలు మందగించాయి – వేగుళ్ల జోగేశ్వరరావు
గత ఏడాది తో పోల్చుకుంటే ఈ ఏడాది కరోనా నివారణా చర్యలు మందగించాయని, ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఐదు రోజులకు ఒకసారి పట్టణమంతా హైపో క్లోరైడ్ ద్రావణం పిచ్చికారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.
మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా హాజరై మాట్లాడారు.
సమావేశంలో తొలుత అజెండా కాపీలోని పలు అభ్యంతరాలను ఎమ్మెల్యే వేగుళ్ల తో బాటు టీడీపీ కౌన్సిలర్ లు కాశిన కాశీ విశ్వనాధం, యారమాటి గంగరాజు లు లేవనెత్తారు. వాటిపై సమాధానం చెప్పాలని కమీషనర్ ని కోరారు.
అయితే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని కమీషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి పోతానని, ఎవరికి ఎలా బాగుంటే అలా చేసుకొండని కాస్త దురుసుగా సమాధానమిచ్చారు.
ముఖ్య మైన విషయాలపై చర్చిస్తే బాగుంటుందని, అనవసర విషయాలు లెవనెత్తడం సమంజసం కాదని పేర్కొన్నారు.
దీనిపై చైర్ పర్సన్ రాణి స్పందించి కరోనా నేపథ్యంలో సమావేశాన్ని త్వరగా ముగించాలని, ముఖ్యమైన విషయాలు మాత్రమే చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అజెండాలోని 4, 5 అంశాలకు సంబంధించి కాంట్రాక్ట్ కమిటీ,పేనల్ కమిటీ ఏర్పాటు పై సభ్యుల పేర్లు ప్రస్తావించడాన్ని టీడీపీ కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాధం తప్పు పట్టారు.
అజెండాలో సంఖ్య నిర్ణయించే నిమిత్తం కౌన్సిల్ ముందు ఉంచుతున్నట్లు పేర్కొంటూ సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఆ రెండు అంశాలపై జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కాశీ డీసెంట్ ప్రకటించారు.
హైపో క్లోరైడ్ ద్రావణం లీటర్ 20 రూపాయలకే లభిస్తున్న నేపథ్యంలో ప్రయివేటు గా వర్కర్ లను నియమించి పట్టణం లోని అన్ని ప్రాంతాలను సానిటైజ్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఒకసారి పట్టణ మంతా పిచ్చికారీ చేసేందుకు 50 వేల రూపాయలు లోపు ఖర్చు అవుతున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ప్రతి ఐదు రోజులకు ఒకసారి పట్టణమంతా పిచ్చికారీ చేయించాలని వేగుళ్ల కోరారు.
అలాగే ప్రస్తుతం క్రైస్తవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సమాధుల నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని 29వ వార్డు కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
దిబ్బగరువు వద్ద క్రైస్తవ స్మశాన వాటిక పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో విజయమహల్ వద్ద గల హిందూ స్మశాన వాటికలో నిరుపయోగంగా మిగిలివున్న కొంత భాగాన్ని క్రైస్తవులకు కేటాయించాలని కోరారు.
కాగా కరోనా నేపథ్యంలో తరుచు సచివాలయాలు వద్ద సమావేశాలు నిర్ణయించడం దేనికని కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య లక్ష్మీ ప్రశ్నించారు. ఎక్కువ మంది గుమికూడటం మంచిది కాదని, కొన్ని విషయాలు ఫోన్ లతో సరిపెడితే సరిపోతుందని పేర్కొన్నారు.
దీనిపై చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ ప్రజలు నమ్మి గెలిపించినప్పుడు ప్రాణాలకు తెగించి పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే సమావేశాలు తక్కువ జరిగేవిధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
పార్కు అభివృద్ధి పనులకు సంబంధించి సింగిల్ టెండర్ ను ఆమోదించడంపై 9వ వార్డు కౌన్సిలర్ చుండ్రు చిన సుబ్బారావు చౌదరి అభ్యంతరం వ్యక్తం వేశారు.
మరోసారి టెండర్ నిర్వహిస్తే మరింత తక్కువకు టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తన వార్డులోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కౌన్సిలర్ లు చైర్ పర్సన్ రాణి కి వినతి పత్రాలు సమర్పించారు.
కాగా పురపాలక సంఘ చట్టాలపై అత్యంత పరిజ్ఞానం కలిగిన ఎమ్మెల్యే వేగుళ్ల సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అధికారులు తడబాటుకు గురవడం చర్చనీయాంశంగా మారింది.