తిరుమల తిరుపతి దేవస్థానం
టీటీడీకి రూ 10 కోట్ల కానుకగా సమర్పించిన పాస్కో సి.యి.ఓ.
9 కోట్ల రూపాయలు ఎస్వీబీసీకి, కోటి రూపాయలు సర్వశ్రేయస్సు ట్రస్టుకు
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఢిల్లీకి చెందిన పాస్కో కంపెనీ సి.యి.ఓ. శ్రీ సంజయ్ పస్సి, మరియు శాలిని పస్సి అనే భక్తులు శుక్రవారం 10 కోట్ల రూపాయలు కానుకగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ మేరకు డిడిలను అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో 9 కోట్ల రూపాయలు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు, కోటి రూపాయలు సర్వశ్రేయస్సు (బాలమందిర్) ట్రస్టుకు అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2004 నుండీ తాము ప్రతీ యేటా శ్రీవారిని కనీసం రెండు సార్లైన దర్శించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అనేక రూపాలలో టి.టి.డి. నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని, అన్ని విధాలా ఈ కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తాననీ ఈ సందర్భంగా సంజయ్ తెలియజేశారు.
ఇదిలా ఉండగా,
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 27వ తేదీ శనివారం (రేపు) రాత్రికి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది.
రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
మరియు తిరుమలలో ఫిబ్రవరి 27వ తేదీన జరగాల్సిన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా కుమారధార తీర్థంలోకి భక్తులకు అనుమతి లేదని టిటిడి స్పష్టం చేసింది.
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి.
మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
👉 మార్చి 9న సర్వ ఏకాదశి.
👉 మార్చి 11న మహాశివరాత్రి.
👉 మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.
👉 మార్చి 24న స్మార్త ఏకాదశి.
👉 మార్చి 25న వైష్ణవ మాధ్వ ఏకాదశి.
👉 మార్చి 28న శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి.