మీసాల రాంబాబు సెల్ ఫోను కొన్నారు
అవునండీ మీసాల రాంబాబు సెల్ ఫోన్ కొన్నారు. అయితే అందులో వింతేముంది అనుకుంటున్నారు? అక్కడే మీరు పప్పులో కాలేసారు.
ఎంతో ప్రజాదరణ కలిగిన, ప్రముఖ పశుపోషకులు, దాత గుణ్ణం రాంబాబు ఆయన్ని ప్రజలు ముద్దుగా మీసాల రాంబాబు అని పిలుచుకుంటారు, ఫోటో చూసారుగా మరి ఆ పేరు సరైనదే కదా.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో ఈయన ఆలమూరు మండలం గుమ్మిలేరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సరే ఇంతకీ సెల్ ఫోన్ కొనడం కూడా వింతే అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.
సర్పంచ్‌గా గెలవగానే ఆయన ఈ సెల్ ఫోన్ కొన్నారు. సెల్ ఫోన్ కొనడానికి కూడా సర్పంచ్ అవ్వాలేంటి అని తీసిపారేకండి.
ఈయన మొదటి నుంచి సెల్ ఫోన్‌కు వ్యతిరేకి. ల్యాండ్ ఫోన్ ద్వారానే అందరితో మాట్లాడుతూ ఉంటారు.
బయటకు వెళ్లినపుడు మరీ తప్పనిసరి పరిస్థితులు అయితే పక్కన ఉన్న ఎవరొకరి ఫోన్‌తో మాట్లాడతారు, అంతే గానీ ఇప్పటివరకు ఆయన ఒక్క సెల్ ఫోన్ కూడా కొనలేదు, వాడలేదు.
మనలో చాలా మందికి మన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లే అందరివీ గుర్తుండవు, కానీ ఈయన ఓ మూడొందల ఫోన్ నెంబర్లు అవలీలగా చెప్పేస్తారు.
ఒకవేళ ఎవరికైనా ఆయనతో అవసరం ఉంటే ఏ సమయంలో ఎక్కడుంటారు, ఆయన పక్కన ఎవరుంటారో తెలుసుకుని వారికి ఫోన్ చేస్తుంటారు.
సర్పంచ్ అయ్యాకా అలా కుదరదు కదా మరి, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజల వత్తిడితో ఈరోజు సెల్ ఫోన్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని రాంబాబు చెబుతున్నారు.
అయితే రాంబాబు సెల్ వాడటం ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.