కథలు చెప్పాడు ఐదుగురిని కడతేర్చాడు
భక్తి ముసుగులో ఐదుగురు మహిళల హత్యలు
చివరకి జీవితఖైదుతో కటకటాల వెనక్కి
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు: అతడొక పరమ భక్తుడు, వెంకన్న స్వామి అన్నా, కనకదుర్గమ్మ అన్నా ఆపారమైన భక్తి. వారి కథలు చెప్పుకుంటూనే భక్తి ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు.
ఇది ప్రపంచానికి కనిపించే అతని భక్తి ముసుగు. కానీ ప్రపంచానికి కనిపించని మరో చీకటి కోణం ఉంది. అతడి కన్ను పడితే చాలు అమాయక మహిళలు అతడి వలలో పడాల్సిందే.
అతడి మాయ మాటలకి అమాయక మహిళలు బలి అయిన ఘటనలు ఇప్పటికి ఐదు సార్లు జరిగాయి.
కపిలేశ్వరపురం మండలం కేదారిలంకకు చెందిన సలాది లక్ష్మీనారాయణ గ్రామాల్లో వెంకన్నబాబు, కనకదుర్గమ్మ కథలు చెబుతూ ఉండేవాడు.
ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి, అమాయక మహిళలను నిర్జన ప్రదేశాలకు తీసుకు వెళ్లేవాడు. అ తరువాత వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు.
అంతటితో ఆగక, తన బండారం బట్టబయలు కాకుండా ఉండేందుకు, అతి క్రూరంగా వారిని హతమార్చి, వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకునేవాడు.
అంతటితో కథ ముగిసిపోలేదు. మహిళల శవాలు కనిపించకుండా ఇసుక తిన్నెల్లో పూడ్చి పెట్టేవాడు. గతంలో ఇతగాడిని పోలీసులు రిమాండుకు తరలిస్తుండగా వారి కళ్లు గప్పి తప్పించుకుని మళ్లీ చిక్కాడు.
ఇప్పటి వరకు అతగాడి చేతుల్ల ఐదుగు అమాయక మహిళలు ప్రాణాలు విడిచారు, అయితే నగరం స్టేషన్లో నమోదైన భాగ్యవతి హత్య కేసులో లక్ష్మీనారాయణకు జీవిత ఖైదు ఖరారైంది.
అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి సీఎస్ మూర్తి ఈ మేరకు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లకు తమకు తగిన న్యాయం జరిగిందని బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.