భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ పంజా
ఓ వైపు కరోనా కాటు.. మరోవైపు బ్లాక్ ఫంగస్ పంజా.. దీంతో దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో… వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
నీరసంగా ఉండటంతో అలాంటి వారిని బ్లాక్ ఫంగస్ టార్గెట్ చేస్తోంది. ఇది పాత ఇన్ఫెక్షనే అయినప్పటికీ.. ఇండియాలో ఇప్పుడు దీని కేసులు ఎక్కువవుతున్నాయి.
అంటువ్యాధి కాకపోయినా.. ఇది వచ్చిన వారికి 24 గంటల్లో ట్రీట్మెంట్ అందించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం అవుతున్నాయి.
ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ కేసు నమోదైతే.. వెంటనే దానిపై ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500లపైనే ఈ కేసులు ఉన్నాయి.
తాజాగా ఆంధప్రదేశ్ లోనూ బ్లాక్ ఫంగస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్‌తో శనివారం ముగ్గురు మృతి చెందారు.
గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స తీసుకొని కోలుకున్నారు.
అయితే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో బ్లాక్‌ఫంగస్ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు.
ఈ క్రమంలో యువకుడు శుక్రవారం, వృద్ధుడు శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.