కోవిడ్ పరీక్షా ప్రక్రియలో వినూత్న విధానం!
ఉప్పునీటి పుక్కిలింతతో ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి
నాగపూర్.లోని “నీరీ” శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితం
మూడు గంటల్లోనే ఫలితం తేలే అవకాశం..
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ప్రయోజనకరం
కోవిడ్19 వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచీ దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షా పద్ధతులను బలోపేతం చేయడం, పరీక్షల మౌలిక సదుపాయాలను పెంచుకోవడం వంటి అంశాలపై అనేక ముందడుగులు పడ్డాయి.
ఈ నేపథ్యంలో నాగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు మరో మైలు రాయిని అధిగమించారు.
శాస్త్ర విజ్ఞాన, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)కి అనుబంధంగా, నాగపూర్ లో ఉన్న జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (నీరీ-ఎన్.ఇ.ఇ.ఆర్.ఐ.) శాస్త్రవేత్తలు కోవిడ్-19 నమూనాల పరీక్షకోసం కొత్త తరహా పద్ధతిని రూపొందించారు.
‘ఉప్పునీటిని పుక్కిలించే ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి’లో వారీ పరీక్షకు రూపకల్పన చేశారు.
ఎన్నో ప్రయోజనాలు అందించే ఒకే పద్ధతి: సరళం, వేగవంతం, సౌకర్యం, పొదుపు
ఉప్పునీటిని పుక్కిలించే పద్ధతిలో జరిపే ఈ వినూత్న పరీక్షఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ప్రయోజనాలన్నీ ఒకే పరీక్షతోనే లభిస్తాయి.
పరీక్షకూడా ఎంతో సరళతరంగా, వేగవంతంగా, సరసమైన ధరలో, రోగికి కూడా ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. పరీక్షను జరిపిన వెంటనే చాలా త్వరగా ఫలితం లభిస్తుంది.
మౌలిక సదుపాయాల పరంగా అతితక్కువ పరికరాలు అవసరమవుతాయి కాబట్టి, ఈ పరీక్షా విధానం గ్రామీణ ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు అనువుగా ఉంటుంది.
ఈ సందర్భంగా నీరీ సంస్థకు చెందిన ఎన్విరాన్ మెంటల్ వైరాలజీ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ :
“రోగి ముక్కునుంచి సేకరించిన స్వాబు ద్వారా జరిపే పరీక్షల ఫలితాలు అందడానికి చాలా వ్యవధి పడుతుంది. ఈ పద్ధతి రోగికి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుంది.
తీసుకున్న నమూనాను సేకరణ కేంద్రానికి రవాణా చేయడానికి కూడా కొంత వ్యవధి వృధా అవుతుంది. దీనికి బదులు ఉప్పునీటి పుక్కలింతతో కూడిన ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి చాలా మెరుగైనది.
ఇది రోగికి సులభంగా ఉంటుంది. మరింత సౌకర్యవంతంగా, త్వరగా ఫలితం ఇచ్చేదిగా ఉంటుంది. నమూనా సేకరణ కూడా అప్పటికప్పుడే వెంటనే జరుగుతుంది. ఫలితం ఫలితాలు 3 గంటల్లోగా అందుతాయి.” అని అన్నారు.
రోగి సొంతంగా నమూనాను సేకరించవచ్చు.
ఇది చాలా సరళతరమైన పరీక్షా విధానం. రోగి కూడా తనంతట తానే నమూనాను సేకరించవచ్చు. అని మరో శాస్త్రవేత్త డాక్టర్ ఖైర్నార్ చెప్పారు.
“నాసికా రంద్రాలనుంచి, నోటినుంచి స్వాబును, లాలాజలాన్ని సేకరించాలంటే సాంకేతికంగా నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం. పైగా ఆ పద్ధతిలో కాలహరణం ఎక్కువగా జరుగుతుంది.
దీనితో పోల్చితే, ఉప్పునీటి పుక్కిలింతతో నిర్వహించే ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి చాలా సరళంగా ఉంటుంది. ఉప్పునీటి ద్రావణాన్ని పరీక్షనాళికలో నింపి తీసుకోవచ్చు.
ఈ పద్ధతిలో రోగి ఉప్పునీటి ద్రావణాన్ని పుక్కిలించి, దాన్ని తన నోటిద్వారా పరీక్షనాళికలోకి ఊదేస్తే సరిపోతుంది.
ఇలా సేకరించిన ద్రావణ నమూనాను లేబరేటరీకి తీసుకెళ్లి అక్కడ గది ఉష్ణోగ్రతవద్ద నీరీ లేబరేటరీ తయారు చేసిన ప్రత్యేక బఫర్ ద్రావణంలో ఉంచుతారు.
ఈ ద్రావణాన్ని వేడి చేసినపుడు ఒక ఆర్.ఎన్.ఎ. టెంప్లేట్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత దాన్ని రివర్స్ ట్రాన్సుక్రిప్షన్ పాలీమిరేస్ చెయిన్ రియాక్షన్ (ఆర్.టి.-పి.సి.ఆర్.) కోసం మరింత ప్రాసెస్ చేస్తారు.
ఈ పద్ధతిలో నమూనాను సేకరించి, పరీక్షకోసం ప్రాసెస్ చేయడం చాలా పొదుపుతో కూడుకున్నది.
ఆర్.ఎన్.ఎ.ను సంగ్రహించేందుకు ప్రత్యేకి కిట్ ను ఉపయోగిస్తూ మనం ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతితో పోలిస్తే తాజా పద్ధతి ఎంతో పొదుపైనదే.
పైగా జనం కూడా తమంతట తామే పరీక్షించుకునేందుకు ఈ పద్ధతిలో అవకాశం ఉంది.” అని ఖైర్నార్ అన్నారు.
ఈ పద్ధతిలో వృధా అయ్యే పదార్థాలు కూడా చాలా తక్కువ కాబట్టి, ఇది పర్యావరణ హితంగా కూడా ఉంటుందని అన్నారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పరీక్షా ప్రక్రియకు ఇదో వరం.
సృజనాత్మకమైన ఈ పరీక్షా పద్ధతి గ్రామీణ ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మామూలుగా గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో పరీక్షలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం కాస్త ఇబ్బందికరం కాబట్టి అలాంటి ప్రాంతాలకు ఇది చాలా ఉపయోగకరమన్నది వారి అభిప్రాయం.
వినూత్నమైన ఈ కొత్త పరీక్షా పద్ధతికి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) ఆమోదం కూడా లభించింది.
ఈ పద్ధతిని దేశవ్యాప్తంగా అనుసరించేలా పరీక్షా విధానానికి అనుగుణంగా మిగతా పరిశోధనా శాలలకు కూడా శిక్షణను అందించాలని నీరీ సంస్థను కోరారు.
ఈ కొత్త పరీక్షా పద్ధతి అమలు చేయడానికి నాగపూర్ నగరపాలక సంస్థ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీనితో నీరీ సంస్థలో నూతన పద్ధతిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మొదలయ్యాయి.
“దేశవ్యాప్తంగా అమలు చేయడం అవసరం”
విదర్భ ప్రాంతంలో ఒకవైపు కోవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో నీరీ సంస్థలోని ఎన్విరాన్ మెంటల్ వైరాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, లేబరేటరీ టెక్నీషియన్లు ఎన్నో ప్రయాసలకోర్చి ఈ కొత్త పరీక్షా పద్ధతికి రూపకల్పన చేశారు.
వినూత్నమైన ఈ పద్ధతి జాతీయ స్థాయిలో అమలులోకి రాగదలదని, తద్వారా వైరస్ మహమ్మారిపై పోరాటం మరింత బలోపేతం కాగలదని డాక్టర్ ఖైర్నార్, ఆయన సహచర బృందం ఎంతో ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు.