చిరు వ్యాపారులకు అండగా ఉంటాం – ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ .
చిరు వ్యాపారుస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రభుత్వ ఛీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు.
గురువారం ఉదయం హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో నక్కలగుట్ట ప్రాంతంలో తారసపడ్డ వీధి వ్యాపారస్తురాలిని చూసి ఆగి ఆమెతో ముచ్చటించారు. కుటుంబ పరిస్థితులను గురించి వాకబు చేశారు.
ప్రభుత్వం తరఫున లోన్ ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా క్లిష్ట సమయంలో చిరు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫలితంగా వాటిపై ఆధారపడ్డ వీధి వ్యాపారులు ఆర్థికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
చేతిలో చిల్లి గవ్వ లేక ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని జీవనం కొనాగిస్తున్నారని వారందరికి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా సరైన రీతిలో వ్యాపారం జరగక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వారి దుస్థితిని గుర్తించి కరోనా కాలంలో అండగా ఉండేందుకు వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రతి చిరు వ్యాపారికి రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు వీలుగా మెప్మా అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టాలన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వం ధ్యేయమని ఈ సందర్భంగా దాస్యం వినయ భాస్కర్ అన్నారు.