రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి..
మండపేట: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల దగ్గర ప్రభుత్వం కొన్న ధాన్యానికి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని రైతులకు వెంటనే డబ్బుచెల్లించాలని కోరుతూ మండపేట బిజెపి పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దళారుల దోపిడీల నుండి రైతుల కష్టాన్ని రక్షించాలని, తరుగు, తాలు అంటూ రైతుల కష్టాన్ని దోచుకునే వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పంట చేతికి వచ్చే సమయంలో, అకాల వర్షానికి పాడయిపోయిన పంటకు చెల్లించాల్సిన పంట బీమాను, కొందరికే కాకుండా, అందరు రైతులకు చెల్లించాలని అన్నారు.
సబ్సిడీ కింద ఇచ్చే వ్యవసాయ పరికరాల పంపిణీని వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. సూక్ష్మసేద్యం ఆవశ్యకతను గుర్తించి, డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లను వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రూరల్ అధ్యక్షులు రాయి వీర్రాజు, గొడవర్తి రామచంద్ర రావు, సూరంపూడి సత్యనారాయణ, పోలరాజు తదితరులు పాల్గొన్నారు.