ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి – డిఎస్పీ బాలచంద్రారెడ్డి
మండపేట:- మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని రామచంద్రపురం డిఎస్పి డి. బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు.
మండపేటలోని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఉన్న న్యూ కాలనీ లో శనివారం సాయంత్రం ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి టౌన్ సిఐ అడపా నాగ మురళి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎటువంటి అలజడులు, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వారిని అడ్డగించిన, గలాట సృష్టించినా, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఓటరులకు రాజ్యాంగ పరంగా ఓటు హక్కు వినియోగించే హక్కు ఉందని వారికి రక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు.
ఎలాంటి గొడవలు చేసినా రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యంగా యువకులు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో అల్లర్లకు ప్రయత్నిస్తే వారి కెరీర్ పాడవుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని హెచ్చరించారు.
అలాగే మరో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఉన్న రావులపేటలో సి ఐ అడపా నాగ మురళి ఆధ్వర్యంలో ఉదయం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆయా కార్యక్రమాల్లో టౌన్ ఎస్ ఐ రాజేష్ కుమార్, పోలీసు సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.