రాయ్‌పూర్: ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఎట్టకేలకు విడుదల అయ్యాడు.
తమ చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు. కొద్దిసేపట్లో రాకేశ్వర్ బెటాలియన్ వద్దకు చేరుకోనున్నాడు.
బీజాపూర్ జిల్లా తర్రెం ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టులు సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్‌ను ఎత్తుకెళ్లి పోయిన సంగతి తెలిసిందే.
చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని ప్రభుత్వానికి మావోయిస్టులు అవకాశం ఇచ్చారు.
అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక ముందే మావోయిస్టులు రాకేశ్వర్‌సింగ్‌ను విడుదల చేయడం ఆసక్తిగా మారింది. జవాన్ విడుదలను ఛత్తీస్గడ్ ఐజీ ధ్రువీకరించారు.
మరి కాసేపట్లో బెటాలియన్‌కు రాకేశ్వర్‌సింగ్ చేరుకోనున్నాడు. ఈనెల 3వ తేదీన శనివారం ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా తర్రెంలో ఎదురుకాల్పులు జరిగాయి.
హోరాహోరీగా సాగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా.. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. తమ దళానికి చెందిన నలుగురు మృతి చెందారని మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే.
అనంతరం ఆయన తమ వద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు.
ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మంగళవారం లేఖ విడుదల చేశారు.
అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పందించలేదు. అకస్మాత్తుగా జవాన్‌ను విడుదల చేయడం మావోయిస్టుల వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదు.