కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ల పనితీరు ఒక్కటే..
ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ప్రభు..
మండపేట: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉందని మండపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రభు పేర్కొన్నారు.
డాక్టర్ ప్రభు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కరోనాకు ఎవరూ భయపడవలసిన పనిలేదని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులను వాడుతూ ఇంటి వద్దే జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
కొంతమంది కోవీషీల్డ్ కంటే కోవాక్సిన్ బాగా పనిచేస్తుంది అనే అపోహలతో ఉన్నారని ఏ వాక్సిన్ అయినా యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేయడానికే వేస్తారని అన్నారు.
మొదటి డోసు కోవాక్సిన్ వేసుకుంటే రెండో డోసు కూడా కోవాక్సిన్ వేసుకోవాలని, అలాగే మొదటి డోసు కోవీషీల్డ్ వేసుకుంటే రెండో డోసు కూడా కోవీషీల్డ్ వేసుకోవాలని అన్నారు.
మండపేట వైద్య సిబ్బంది అంతా కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నామని అన్నారు.
కొంతమంది ప్రతి చిన్న విషయానికి నేరుగా వైద్యులకు ఫోన్లు చేస్తున్నారని దానివలన ఫోన్లు పని చేయని పరిస్థితి ఏర్పడుతుందని, కొన్ని సమయాలలో అత్యవసర వైద్యానికి అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే నేరుగా ఆరోగ్య కేంద్రానికి గానీ, సచివాలయంలో గాని, వాలంటీర్ ను గాని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలందరూ వైద్యులకు సహకరించాలని కోరారు.