మండపేటలో ఐసోలేషన్ సెంటర్ ప్రారంభం..
మండపేట: కోవిడ్ సోకిన వారికి ఇంటి దగ్గర మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఐసోలేషన్ ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన టీం సురక్ష సభ్యుల సేవలు ప్రశంసనీయమని మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పేర్కొన్నారు.
మండపేటలోని టీమ్ సురక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏడిద రోడ్డులో శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించారు.
ఐసోలేషన్ సెంటర్ ను మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, మండపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కళ్యాణి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మొదటి వేవ్ నుండి రెండవ వేవ్ వరకు టీమ్ సురక్ష సభ్యులు దాతల సహకారంతో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయడం చాలా ప్రశంసనీయమని అన్నారు.
ఈ ఐసోలేషన్ లో కేవలం ఇంటి దగ్గర సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడేవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారని అన్నారు.
ఇక్కడ 20 బెడ్లు ఏర్పాటు చేశారని, వారికి కావలసిన భోజన సదుపాయం, మందులు దాతల సహకారంతో టీం సురక్ష సభ్యులు అందజేస్తారని, ఏ ఎన్ ఎమ్ పర్యవేక్షణ చేస్తారని అన్నారు.
ఎవరికైనా లక్షణాలు ఎక్కువగా వుండి ఇబ్బంది పడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని అన్నారు.
ఇది కేవలం హోమ్ ఐసోలేషన్ మాత్రమేనని ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉండే వారు ఈ ఐసోలేషన్ ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీమ్ సురక్ష సభ్యులు, గ్రీన్ క్లబ్ సభ్యులు జమాతే ఇస్లామ్ హింద్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.