ఆ నిర్లక్ష్యం ఖరీదు ఐదుగురి నిండు ప్రాణాలు
పుణేలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు 15 రోజుల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరుగా ప్రాణాలు విడిచారు.
తల్లితో మొదలైన ఈ మరణ మృదంగం ఇప్పటి వరకు కుటుంబలో ఐదుగురిని బలిగొన్నది.
ఈ కుటుంబం చేసిన తప్పేమిటో తెలుసా, ఒక చిన్న కీటకాన్ని తక్కువ అంచనా వేయడమే, అవునండి కరోనాను ఈ కుటుంబం తక్కువ అంచనా వేసింది, అంతే కరోనా తన ప్రతాపాన్ని ఈ కుటుంబంపై చూపించింది.
కొద్ది రోజుల క్రితం పూణేలోని ఓ ఇంట్లో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది, అయితే ఈ పూజ నిర్వహణలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు కూడా ఆ కుటుంబం పాటించినట్లు లేదు.
అంతా మన కుటుంబ సభ్యులే, జరుగుతున్న తంతు కూడా అంతా మన ఇంట్లోనే అనుకున్నారో ఏమో మరి.
కానీ అక్కడే ఆ కుటుంబం మహమ్మారికి స్వాగతం పలికినట్లైంది, ఏ ముక్కు సందుల్లోంచి దూరిందో తెలీదు కానీ ఆ కరోనా మహమ్మారి, తనను తక్కువ అంచనా వేసిన ఆ కుటుంబంపై పగపట్టినట్లుగా కుటుంబంలోని పిల్లా పెద్దా తేడా లేకుండా మొత్తం ఐదుగురి ప్రాణాలను బలిగొంది.
కేవలం 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇలా కరోనా బారిన పడి మరణించడంతో ఆ ప్రాంతం అంతా విషాథ ఛాయలతో నిండిపోయింది.
విషాదం ఒకవైపు అలముకుంటే మరోవైపు ఈ మహమ్మారి బారిన పడి ఇంకెంత మంది బలి కావలసి వస్తుందా అని ఈ ఉదంతం గురించి తెలిసిన వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఏదేమైనా, కంటికి కనిపించని ఈ శత్రువుతో ప్రపంచమంతా యుద్ధం చేయవలసిన పరిస్థితులను ఇప్పుడు మనం చూస్తున్నాం.
ఈ గడ్డు కాలంలో మానవాళి బ్రతికి బట్టకట్టాలంటే “నాకేం కాదులే అనే ధోరణి వదిలి, నాకేమి కాకూడదూ, నా కుటుంబానికి ఏమీ కాకూడదూ” అనే జాగ్రత్త మన అందరిలో రావాలి.
కరోనా మహమ్మారిని పూర్తిగా జయించాలంటే పాటించాల్సిన కనీస నియమాలను తప్పక పాటించండి.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన వేడుకలు జనసమూహాలకు వెళ్ళడం వంటివి కొంతకాలం మానుకోక తప్పదు మరి.
ఆలోచించుకోండి, మీ ఒక్కరి నిర్లక్ష్యం మిమ్మల్ని మాత్రమే కాదు మీ కుటుంబం మొత్తానికీ శాపంగా మారవచ్చు.