వైయస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల
ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతన్నలకు రూ. 1,820.23 కోట్ల బీమా పరిహారాన్ని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఇబ్బందులు వల్ల కలిగే పంట దిగుబడి నష్టాల నుంచి రైతన్నలకు ఉపశమనం కలిగించేలా, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హమీని నెరవేరుస్తూ శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న ధీమా వైయస్సార్ ఉచిత పంటల బీమా.
కరోనా నేపధ్యంలో ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నలకు పెట్టుబడి కోసం మొన్ననే వరసగా మూడో ఏడాది మొదటి విడత రైతు భరోసా సాయంగా 52.38 లక్షల మందికి రూ. 3,928 కోట్లు శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది
రైతన్నలకు మరింత మేలు జరగాలనిపెట్టుబడి సమయానికే సాయం ఉండాలన్న మంచి ఉద్దేశంతో నేడు మరో రూ. 1,820.23 కోట్లను ఖరీఫ్ 2020 ఉచిత పంటల బీమా క్షెయిమ్‌గా 15.15 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది
గత ప్రభుత్వ హయాంలో 2018–19కి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బీమా క్లెయిమ్ బకాయిలతో పాటు ఈ ప్రభుత్వం 2019–2020 సంవత్సరములో వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్లెయిమ్‌ల క్రింద ఇచ్చిన రూ. 1252.18 కోట్లతో కలిపి మొత్తం రూ. 1968.02 కోట్ల బీమా పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించింది.
నేడు 2020–21కి అందిస్తున్న మరో రూ.1820.23 కోట్లతో కలిపి మొత్తం రూ.3,788.25 కోట్ల బీమా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది.
గతంలో క్లెయిమ్‌లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో, ఎంత మందికి వస్తాయో కూడా తెలియని పరిస్ధితి ఉంటే… ఈ ప్రభుత్వం మాత్రం గత ఖరీప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఈ సంవత్సరం ఖరీప్ సీజన్ ప్రారంభ సమయానికే చెల్లిస్తుంది.
ఇంత వేగంగా బీమా పరిహారం చెల్లింపులు జరగడం చరిత్రలోనే మొదటిసారి.
అంతే కాకుండా రైతన్నలను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో 2020 ఖరీప్‌లో అకాల వర్షాలు మరియు నివర్ తుఫాన్ వల్ల కలిగిన పంట నష్టానికి గాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీప్ సీజన్ ముగిసేలోగానే రూ.931 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం అందించింది.
వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలలో విత్తనం నుండి పంట కొనుగోలు వరకు రైతన్నలకు సేవలందించడంతో పాటు, గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలు ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు నష్టాల వివరాలు అంచనా వేసి ఏ సీజన్‌కు ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) చెల్లించే ఏర్పాటు చేసింది.
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలలో ప్రతి పథకానికి ప్రదర్శించినట్టుగానే వైయస్సార్ ఉచిత పంటల బీమా లబ్దిదారుల జాబితాను ప్రదర్శిస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని.. సాగు చేసి, ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నది ప్రభుత్వం శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా రైతన్నలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం నేటి వరకు అందించిన సాయం రూ.83,085.45 కోట్లు.