శ్రీనగర్లో ప్రారంభమైన డిఆర్డీఓ 500 పడకల కోవిడ్ ఆస్పత్రి సేవలు
శ్రీనగర్ లోని ఖోన్మోహ్ వద్ద 500 పడకల కోవిడ్ ఆసుపత్రి పనిచేయడం ప్రారంభించింది. ఈ ఆసుపత్రిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) 17 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసింది.
పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూరుతాయి. ఈ కోవిడ్ సదుపాయంలో వెంటిలేటర్లతో 125 ఐసియు పడకలు ఉన్నాయి, వీటిలో 25 ప్రత్యేకంగా పిల్లలకు కేటాయించారు.
62 కెఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకుల నుండి మొత్తం 500 పడకలకు నిరంతర ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉంది.
ఆసుపత్రి నిర్వహణ, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగం సమకూరుస్తుంది.
ఉష్ణోగ్రతలు సమతుల్యాన్ని పాటించేలా, సౌకర్యవంతంగా పర్యావరణం ఉండేలా ఆస్పత్రికి కేంద్రీకృత ఎయిర్ కండిషన్ ను ఏర్పాటు చేశారు.
వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక బ్లాక్ లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో సరైన అగ్నినిరోధక ఏర్పాటు, మార్చురీ, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
వైఫై, సీసీ టీవీ లతో పాటు హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చి, ఆధునిక నిర్వహణ పద్ధతులను అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక సాఫ్ట్ వేర్ ను కూడా నిర్వహిస్తున్నారు.
అతి శీతల పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందుకు అనుగుణంగా డాక్టర్లు, పారామెడికల్, భద్రతా సిబ్బందికి తగు ఏర్పాటు చేశారు.