మాఫియా డాన్ చోటా రాజన్ బ్రతికే ఉన్నాడు
అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు కొట్టిపారేశారు. చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టం చేశారు.
రాజన్ కరోనాతో మృతి చెందినట్లుగా శుక్రవారం(మే 7) అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత కాసేపటికే ఎయిమ్స్ అధికారులు దీనిపై స్పందించి స్పష్టతనిచ్చారు.
ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 61 ఏళ్ల చోటా రాజన్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఏప్రిల్ 26న రాజన్‌ను జైలు అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
అప్పటినుంచే రాజన్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా జాతీయ మీడియా సహా అనేక మీడియాల్లో కథనాలు వచ్చాయి.
కానీ ఆ తర్వాత కాసేపటికే అందులో నిజం లేదని ఎయిమ్స్ బృందం వెల్లడించింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడిగా భారత్‌లో అనేక నేరాలకు పాల్పడిన చోటా రాజన్ 2015లో ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన సంగతి తెలిసిందే.
2011లో ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో గతేడాది కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. రాజన్‌పై ఉన్న దాదాపు 68 కేసులను సీబీఐ విచారిస్తుండగా.. ఇందులో ఇప్పటికే 4 కేసుల్లో కోర్టులు అతన్ని దోషిగా తేల్చాయి.
మరో 35 కేసుల్లో సీబీఐ అధికారుల చార్జిషీట్ దాఖలు చేశారు. వీటిపై తుది విచారణ ఇంకా జరగాల్సి ఉంది. తొలుత చోటా రాజన్ దావూద్ గ్యాంగ్‌లో ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు.
ఆ తర్వాత విభేదాల కారణంగా మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలకు దొరక్కుండా తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించాడు.
2015లో ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇంటర్ పోల్ వర్గాలు అతన్ని అరెస్ట్ చేశాయి.