తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితుడైన ప్రముఖతమిళ హాస్యనటుడు వివేక్ గుండెపోటుతో చెన్నై ఆసుపత్రిలో నేటి తెల్లవారుజామున 4.30గం.లకు మృతి!
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, గుండెల్లో నొప్పి రావటంతో సహాయకులు ఆయన్ను వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్య విషమించటంతో శనివారం తెల్లవారు ఝూమున గం.4-35 లకు వివేక్ తుదిశ్వాస విడిచారు.
వివేక్ హార్ట్ ఎటాక్ తో మరణించారని… గురువారం ఆయన తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా కాదని ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాజు శివసామి స్పష్టం చేశారు.
వివేక్ కు కోవిడ్ సోకలేదని … వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగానే ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారని ఆయన వివరించారు.
వివేక్ తేలికపాటి రక్తపోటుతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. వ్యాక్సిన్ ఎవేర్ నెస్ లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం గురువారమే వివేక్ ను అంబాసిడర్ గా ప్రకటించింది.
గురువారం ఆయన చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ సూపర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దక్షిణ తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలోని కోవిల్ పట్టిలో జన్మించిన వివేక్ 1980 ల్లో దర్శక శిఖరం కె. బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.
మంచి టైమింగ్ సెన్స్ ఉన్న వివేక్ కు బాలచందర్ 1987 లో “మనదిల్ ఉరుది వేండం” సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు 300 చిత్రాల్లో నటించారు.
భారత ప్రభుత్వం వివేక్ కు 2009 లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న వివేక్ … కుటుంబ కలహాల కారణంగా భార్య కు విడాకులుల ఇచ్చారు.
కుమార్తెలు తల్లి వద్ద ఉంటుండగా…కుమారుడు కొన్నేళ్ల క్రితం మొదడు వాపు వ్యాధితో మరణించాడు.