నన్నయ విశ్వవిద్యాలయంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి
కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని వీసీ సూచన
కోవిడ్ 19 సెకండ్ వేవ్ విజృంభన నేపథ్యంలో కోవిడ్ కట్టడికి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అన్ని రకాల జాగ్రత్తలు వహిస్తుంది.
శనివారం విశ్వవిద్యాలయం క్యాంపస్ మొత్తం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మాట్లాడుతూ కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపధ్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ గా ప్రకటించి శని, ఆదివారాలు విశ్వవిద్యాలయ ప్రాంగణమంతా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నామని చెప్పారు.
ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలల తరగతి గదుల్లోను, స్టాఫ్ రూమ్ లలోను, హాస్టల్స్ లోను మరియు కేంద్ర పరిపాలన భవనంలోని అన్ని విభాగాలలో పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు.
అలాగే ఉభయగోదావరి జిల్లాల్లోని అధ్యాపకులు, విద్యార్థులు కోవిడ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని స్వీయ నింయత్రణ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
దగ్గు, రొంప, జ్వరం, గొంతునొప్పి, రుచి వాసన తెలియకపోవడం వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వెంటనే హాస్పటల్ కు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని, వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ సమాజక్షేమం కోసం బాధ్యతగా ఉండాలని తెలియజేశారు.