ఓర్పు, సహనం
మనం ఎంతటి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా సంఘజీవులం కాబట్టి బయటి ప్రపంచంతో సంబంధం తప్పదు. మరి ఆ సంఘంలో అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు అందరితో మంచిగా ఉంటూ తాము ఆనందిస్తూ చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందింపచేస్తూ ఉంటారు. మరికొందరు వారికి ఏమాత్రం అవసరం లేకపోయినా ఎదుటివారి విషయాలలో కల్పించుకుంటూ లేనిపోని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకొందరు మరికాస్త ముందుకు వెళ్లి తమకేదో చాలా బాధ్యత, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ “మీ అబ్బాయి కి మొన్ననే ఉద్యోగం పోఇన్దట కదా అనో, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరలేదా అనో, మీకు వ్యాపారంలో నష్టమొచ్చిందట కదా అనో, ”ఇలా సూటిపోటి మాటలతో కాకులలా పొడుస్తూ కోపాన్ని తెప్పిస్తూ మన సహానాన్ని పరిక్షిస్తూఉంటారు.
ఇలాంటి వారిని చూసినప్పుడు మనకి సహజంగా కోపం వస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే భగవంతుని సృష్టిలో వ్యర్థమైనది అంటూ ఏదీ లేదు. ప్రతిదానికీ ఎదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి వారివలన ప్రయోజనం ఏమిటో చూద్దాం. ఇలాంటి వ్యక్తుల సహాయ సహకారాలు మనకు ఎంతగానో అవసరమవుతాయి. మనలో వున్న ఓర్పును, సహనాన్ని పరీక్షించుకునేందుకు దొరికిన అవకాశంగా వీరిని వినియోగించు కోవాలి
ఇలాంటి వారు ఎదురైనప్పుడల్లా వారి మాటలను అవమానంగానో బాధాకరంగానో భావించక, మన సహానాన్ని పరీక్షించుకోవడానికి ఒక చక్కని అవకాశంగా స్వీకరించి ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా సముద్రం ఎలా తొణకక బెణకక నిశ్చలంగా ఉంటుందో అలాగే ఇలాంటి వారివల్ల ఎన్ని అవమానాలు ఎదురైనా మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకోగలగటం సాధన చేయాలి. అప్పుడే మనం పరమ శాంతిని పొందగలుగుతాం.
ఇదెలాగో చూద్దాం
ఒకసారి బుద్ధభగవానుడు భిక్షాటనకై వెళ్ళినప్పుడు ఒక ఇల్లాలు భిక్ష వేయకపోగా ఆయనను సోమరిపోతుగా భావించి నానా మాటలూ అంది. అయినా ఆయన చిరునవ్వుతోనే నిలబడి ఉన్నారు. కొంతసేపటికి విసుగెత్తిన ఆ ఇల్లాలు “ఇందాకటినుంచి ఇంతగా తిడుతున్నాను, నీకేమీ బాధే కలగటం లేదా?” అని ప్రశ్నించింది. అప్పుడు బుద్ధభగవానుడు “తల్లీ! ఒకవేళ నీవు వేసిన భిక్షను నేను స్వీకరించలేదనుకో అప్పుడు ఆ భిక్ష ఏమవుతుంది?” అని ప్రశ్నించారు. అందుకామె “అప్పుడది నా దగ్గరే ఉంటుంది.” అని సమాధానం చెప్పింది. “అలాగే తమరు ఇంతసేపూ నన్ను అన్న మాటలేవీ నేను స్వీకరించలేదు” అని చెప్పి ఆయన ముందుకు సాగిపోయారు.
ఒక రోజు ఒక మహర్షి నదీ స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక పొగరుబోతు ఆయనపై ఉమ్మి వేశాడు. ఆయన మారు మాట్లాడక తిరిగి నదీ స్నానం చేసి వచ్చారు. ఆ పొగరుబోతు మళ్ళీ ఉమ్మి వేయడం, ఈయన మళ్ళీ స్నానం చేయడం ఇలా 108 సార్లు జరిగింది. చివరికి విసుగెత్తిన అతడు
“నేను ఇన్నిసార్లు నీమీద ఉమ్మినా నీకు సిగ్గు అనిపించటం లేదా?” అని ప్రశ్నించాడు .
అందుకు ఆ మహర్షి “సోదరా! సిగ్గెందుకు. ఈరోజు ఏకాదశి. పర్వదినం, నా అంతట నేను అనుకోలేదు కానీ నీ దయవల్ల నేనివాళ 108 సార్లు నదీ స్నానం చేయగలిగాను. ఇంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది?” అని నవ్వుతూ బదులిచ్చారు.