బ్రహ్మంగారి మఠం సందర్శించిన మంత్రి వెల్లంపల్లి
మూడు రోజుల్లో సమస్య కొలిక్కి
వైఎస్సార్ జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు ఆయన వెంట ఉన్నారు.
కాగా… బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన వారసులతో వేర్వేరుగా మంత్రి చర్చలు కొనసాగించారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు.
అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. త్వరలో మఠాధిపతి సమస్యపై నిర్ణయం ప్రకటిస్తామని, అందరితో విడివిడిగా చర్చలు జరిపి అందరినీ ఒకే అభిప్రాయంపై రావాలని కోరడం జరిగిందని అన్నారు.
మూడు రోజుల్లో వారే స్వయంగా కూర్చుని మాట్లాడుకుంటాం అని చెప్పారు. ఎక్కడైనా ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి.. అవి మాములే అన్నారు.
శివ స్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని, వారిని దేవాదాయ శాఖ పంపిందనడం పూర్తిగా అవాస్తవమని, దేవాదాయ శాఖకు పీఠాధిపతుల బృందానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
మూడు రోజుల్లో కుటుంబ సభ్యులంతా కూర్చుని ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అని మంత్రి తెలిపారు.