మూత్రపిండాలు బాగుండాలంటే..!
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు.
శరీరమంతా ప్రవహించే రక్తాన్ని ఈ మూత్రపిండాలే శుద్ధి చేస్తాయి.
ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి.
వీటి పనితీరు సక్రమంగా ఉంటేనే ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి.
లేకపోతే అవయవాలు పని చేయడం మానేసి ప్రాణాలకు ముప్పు కలిగించొచ్చు.
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు.
మూత్రపిండాలు చెడిపోతే మరొకరి మూత్రపిండాలను శస్త్రచికిత్స ద్వారా అమర్చడం.. లేదా జీవితాంతం డయాలసిస్ చేయడం ఈ రెండు మార్గాలే ఉంటాయి.
ఇవీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. పైగా మూత్రపిండాల సమస్యను ముందుగానే కనిపెట్టడం కాస్త కష్టమే.
కాబట్టి.. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..! అవేంటంటే..
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ
మధుమేహం ఉన్నవారికి మూత్రపిండాల సమస్యలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతారు.
ఎందుకంటే.. రక్తంలో చక్కెరస్థాయి అధికంగా ఉంటే మూత్రపిండాలకు వడపోత క్లిష్టంగా మారుతుంది.
ఇది అలాగే కొనసాగితే అవి పని చేయడంలో విఫలమవుతాయి.
కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లయినా.. సాధారణ వ్యక్తులైనా రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. అందుకు తగినట్లుగా ఆహారం తీసుకోవాలి.
అధిక బరువుతో అనర్థం
బరువు పెరిగితే.. ఈ భారం అన్ని అవయవాలపై కూడా పడుతుంది.
శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. వాటిని శుద్ధి చేసే క్రమంలో మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది.
ఆ ఒత్తిడి పెరిగితే పనిచేయడం మానేస్తాయి. కాబట్టి.. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీర బరువు అధికంగా పెరగకుండా చూసుకోవాలి.
జంక్‌ఫుడ్ కాకుండా.. మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ధూమపానం.. మద్యపానానికి దూరం
సిగరెట్లు తాగడం.. మద్యం సేవించడం వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో టాక్సిన్లు వచ్చి చేరుతాయి.
వాటి వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మొదట్లో ఏమీ తెలియకపోయినా.. ఆ తర్వాత మూత్రపిండాల పనితీరు నెమ్మదిగా మందగిస్తుంది.
కాబట్టి.. ఇప్పటి వరకు ఆ అలవాట్లు ఉన్నా.. ఇకపై సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటే మంచిది..!
రక్తపోటుతో ప్రమాదం
రక్తపోటుతో.. గుండె జబ్బులే కాదు.. మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తుతాయి.
రక్తపోటు కారణంగా రక్తం వేగంగా ప్రవహిస్తుంటుంది.
ఈ క్రమంలో రక్తనాళాలు.. మూత్రపిండాల్లోని ఫిల్టర్లు దెబ్బతినే అవకాశముంది.
దీంతో రక్తం శుద్ధి అవకుండానే తిరిగి అన్ని అవయవాలకు చేరుతుంది.
ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతూ వెళ్తే మూత్రపిండాలు పనితీరు తగ్గిపోతుంది.
రోజుకు 8-10 గ్లాసుల నీరు
నీరు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని వైద్యులు చెబుతారు.
నీరు తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఉంటుంది.
చర్మం నిగనిగలాడుతుంది. వీటికన్న మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటంలో నీరు దోహదపడుతుంది.
అధిక మొత్తంలో నీరు తాగడం వల్ల వడపోత సమయంలో మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.
మూత్రపిండాల సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి.. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.
ఔషధాల అతివాడకం వద్దు
కొంతమంది ప్రతి చిన్న సమస్యలకు మందులు వేసుకుంటుంటారు. ముఖ్యంగా నొప్పి నివారణ మందులు తరచూ వాడుతుంటారు.
ఇది చాలా ప్రమాదకరం. మూత్రపిండాలు విఫలమవడానికి అధికంగా మందులు వాడటమే ముఖ్య కారణమని చెప్పొచ్చు.
మందుల్లో ఉండే కొన్ని రసాయనాలు నేరుగా మూత్రపిండాలకు చేరి.. అక్కడి ఫిల్టర్లను నాశనం చేస్తాయి.
దీంతో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. అందుకే వీలైనంత వరకు మందులకు దూరంగా ఉండండి.
అత్యవసరమైతే వైద్యుల సూచనల మేరకు మాత్రమే మందులు వాడండి.
మంచి ఆహారం.. వ్యాయామం
పోషకాలు మెండుగా ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆరోగ్యం బాగుంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయాలు తినాలి.
కొవ్వుఉండే ఆహార పదార్థాలను తినకుండా ఉండటమే మేలు.
పాలు.. పాల ఉత్పత్తులు, దినుసులు, చేపలు, కోళ్లు, గింజలు, ధాన్యాలు తినే ఆహారంలో భాగం కావాలి.
అయితే, వంటకాల్లో ఉప్పు, చక్కెర, కొవ్వు తక్కువ ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
అలాగే, శరీరానికి తగిన శ్రమ అవసరం కాబట్టి రోజు వ్యాయామం చేయడం మరవద్దు.
వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటుంది.
అంతేకాదు.. శరీరంలో ఉండే మలినాలు మూత్రపిండాల ద్వారానే కాకుండా వ్యాయమం చేయడం వల్ల వచ్చే చెమట రూపంలో బయటకు పోతాయి.
తరచూ ఆరోగ్య పరీక్షలు
తరచూగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఏడాదికి కనీసం రెండుసార్లయిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకునే వీలు ఉంటుంది.
ముఖ్యంగా మూత్రపిండాల పనితీరుపై పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.