జర్నలిస్టులకు ఉచిత కోవిడ్ వాక్సిన్
విజయవాడ: కోవిడ్ వాక్సిన్‌పై ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని ఆంధ్ర హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి అన్నారు.
స్థానిక ఆంధ్రా హాస్పిటల్స్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం లయన్స్ క్లబ్- 316డి, పుట్టగుంట సతీష్ హెల్త్ ఫౌండేషన్, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని రమణమూర్తి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై ప్రజలను చైతన్యవంతులను చేయడంలో వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో జర్నలిస్టుల కృషి మరువలేనిదని కొనియాడారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిన బాధ్యత కూడా మీడియాపైనే ఉందన్నారు.
లయన్స్ డిస్టిక్ట్ గవర్నర్ పుట్టగుంట సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాజహితం కోసం విశేషకృషి చేస్తున్న జర్నలిస్టులకు వాక్సినేషన్ లో ప్రధమ ప్రధాన్యత ఇవ్వవలసి ఉందని ఈ కార్యక్రమాన్ని సహకరించే అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు.
ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి లయన్స్ క్లబ్, ఆంధ్ర హాస్పటల్స్ యాజమాన్యం అందిస్తున్న సేవా కార్యక్రమాలు అపూర్వమని ప్రశంసించారు.
ఆంధ్రా హాస్పిటల్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పీవీ రామారావు లయన్స్ డిస్టిక్ట్ కాబినేట్ సెక్రటరీ డాక్టర్ కామినేని అచ్యుతబాబు వాక్సినేషన్ పై పలువురు జర్నలిస్టులు వ్యక్త పరిచిన అనుమానాలను నివృత్తి చేశారు.
ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్, అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు ప్రసంగించారు.