ప్రేమని నిరాకరించిన తల్లిని హత్య చేసిన కూతురు
ప్రేమించిన వ్యక్తితో పెండ్లికి నిరాకరించిందని కన్నతల్లినే కుమార్తె హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది
ప్రేమించిన వ్యక్తితో తల్లి పెండ్లికి నిరాకరించారన్న కారణంతో కన్నతల్లినే పథకం ప్రకారం హత్య చేసిన సంఘటన ఈ
నెల 6న విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో చోటు చేసుకొంది.
వివరాల్లోకి వెళ్ళితే..
భోగాపురం మండలం సవరవిల్లి గ్రామంలో సవరవిల్లి లక్ష్మి (40సం.లు) అనే ఆమె చనిపోయినట్లుగా మే 6న భోగాపురం
పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు భోగాపురం ఎస్ఐ మహేష్, పిఎస్ఐ పద్మావతి ఎస్ఆర్ఐ ఆసుపత్రికి చేరుకోగా, ప్రాధమిక విచారణలో వైద్యులు సవరవిల్లి లక్ష్మిది సహజమరణం కాదని నిర్ధారించడంతో, అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మృతి చెందిన సవరవిల్లి లక్ష్మికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. చిన్న కుమార్తె సంవత్సరం క్రితం వేరే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొని, ఇంటి నుండి వెళ్ళిపోగా, పెద్ద కుమార్తె సవరవిల్లి రూపశ్రీ బి.పార్మశీ చదువుతుంది.
రూపశ్రీ కూడా గతంలో తనతో చదివిన అదే గ్రామానికి చెందిన కర్రోతు వరుణ్ సాయిని ప్రేమించింది. ఈ విషయాన్ని తల్లి లక్ష్మికి రూపశ్రీ తెలపడంతో ఆమె కుమార్తెను మందలించింది.
ఇదే విధంగా చిన్న కుమార్తె కూడా ప్రేమ వివాహం చేసుకొని వెళ్ళిపోవడంతో కుటుంబ పరువు పోయిందని, ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా ప్రేమ వివాహం చేసుకొంటే తమ కుటుంబ పరువు పోతుందని కుమార్తె రూపశ్రీని మందలించింది.
రూపశ్రీ ఆమె ప్రియుడు కర్రోతు వరుణ్ సాయిలు తమ ప్రేమ వివాహానికి తల్లి లక్ష్మి ఒప్పుకునే అవకాశం లేదని, ఆమె అడ్డు తొలగించుకుంటేగాని తమ వివాహం జరగదని భావించి, ఒక పథకంను రూపొందించారు.
ఇందులో భాగంగా మే 6న సవరవిల్లి లక్ష్మి ఇంటిలో నిద్రించి ఉన్న సమయంలో కుమార్తె రూపశ్రీ ప్రియుడు వరుణ్ సాయికి ఫోనులో సమాచారం అందించడంతో వరుణసాయి ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు.
ప్రక్కకు తిరిగి నిద్రిస్తున్న లక్ష్మిపై వరుణ్ సాయి కూర్చుని ఆమె చేతులను అదిమి పట్టుకోవడంతో రూపశ్రీ ఆమె ముక్కును మూసేసింది.
కొద్దిసేపు పెనుగులాడిన లక్ష్మి అచేతనంగా ఉండటంతో మృతి చెందిందని భావించి, వరుణ్ సాయి ఇంటి నుండి వెళ్ళిపోయాడు.
తరువాత రూపశ్రీ బయట నుండి వచ్చినట్లు, అప్పుడే ఆమె తల్లి లక్ష్మిని చూసి, చనిపోయినట్లుగా గోల చేయడంతో, ఏమి జరిగిందోనన్న ఆందోళనతో చుట్టుప్రక్కల వాళ్ళు, తండ్రి శ్రీనివాసరావు వచ్చారు.
వారంతా దగ్గరలో ఉన్న ఆర్.ఎం.పి. డాక్టరును పిలవగా, అతను లక్ష్మిని పరిశీలించి పల్స్ కొట్టుకోవడం లేదని, గుండె మాత్రం కొద్దిగా కొట్టుకుంటున్నదని నిర్ధారించారు.
ఆయితే తగరపు వలస దగ్గర గల ఎస్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా, అక్కడ డాక్టర్లు పరిశీలించి లక్ష్మి మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
విచారణలో రూపశ్రీ, వరుణ్ సాయిల మద్య ఫోను సంభాషణలు జరుగుతున్నట్లుగా రుజువుకావడమే గాక, సవరవిల్లి
లక్ష్మి చనిపోయిన సమయానికి ముందు తరువాత వరుణ్ సాయి లక్ష్మి ఇంటికి వచ్చి, వెళ్ళినట్లుగా దగ్గరలో ఉన్న సిసి కెమెరాల్లో నిక్షిప్తం అయింది.
అనూమానం బలపడటంతో పోలీసులు వారిద్దరిని విచారించగా లక్ష్మి మృతిని సహజ మరణంగా చూపాలని నిందితులు ప్రయత్నించినట్లు, నేరాన్ని చేసినట్లుగా వారు అంగీకరించారు.
దానితో రూపశ్రీను సవరవిల్లిలోను వరుణ్ సాయిను పోలిపల్లిలో మే 12న భోగాపురం సిఐ శ్రీధర్ అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
ఈ విషయమై ఈ రోజు విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలను డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి వెల్లడించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ అనిల్ మాట్లాడుతూ –
ప్రేమను అంగీకరించక పోవడంతో నవ మాసాలు మోసి, కని, పెంచిన తల్లినే హత్య చేయడం దురదృష్టకరమని, హత్యను
హీనమైన చర్యగా అభివర్ణించారు.
పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, వారు ఫోనులో ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కేసులో భోగాపురం సిఐ సిహెచ్.శ్రీధర్, ఎస్ఐ మహేష్, పిఎస్ఐ పద్మావతి క్రియాశీలకంగా వ్యవహరించి, హత్య కేసు మిస్టరీని చేధించారన్నారు.