22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్…
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కుల్లో రూ.22 కోట్ల విలువైన 15 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఈ విషయం బయటపడింది. విరాళాల కింద ఇచ్చిన కొన్ని చెక్కులు చెల్లలేదు. కొన్నింటి బ్యాంకు ఖాతాల్లో ఆ మేరకు నిధులు లేకపోవడం, కొన్ని చెక్కులపై సంతకం సరిపోలకపోవడం, చెక్కులపై కొట్టివేతలు వంటి కారణాలతో మరికొన్ని బౌన్స్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో చెక్కుల పొరపాట్లను సవరించేందుకు సంబంధిత బ్యాంకులను సంప్రదిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.
అలాగే చెల్లని చెక్కుల గురించి ఆయా వ్యక్తులను సంప్రదించి కొత్త చెక్కులు ఇవ్వాలని కోరుతామని స్వామి గోవింద్ దేశ్ గిరి చెప్పారు.
బౌన్స్ అయిన 15 వేల బ్యాంకు చెక్కుల్లో సుమారు రెండు వేల చెక్కులు అయోధ్య పరిధిలో వసూలు చేసినవి కాగా మిగతా 13 వేల చెక్కులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వసూలు చేసినవి అని వివరించారు.
కాగా, రామ మందిరం నిర్మాణం కోసం ట్రస్ట్, విశ్వహింద్ పరిషత్ సభ్యులు ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల వసూళ్ల కార్యక్రమంలో రూ.2,500 కోట్లకుపైగా వసూలైనట్లు ట్రస్ట్ వెల్లడించింది.