తెలుగుజాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి, ఆంధ్రరాష్ట్ర అవతరణకు బాటలు వేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు.
ఆ అమరజీవి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
1901లో మార్చ్ 16న తమిళుల ఆధిక్యం ఎక్కువగా ఉన్న ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గల నెల్లూరు జిల్లాలో గురవయ్య మహాలక్ష్మమ్మ గార్లకు అమరజీవి జన్మించారు.
జీవితంలో ఎన్నో ఉచ్ఛ నీచాలు చవి చూసిన ఆయన యుక్త వయసులోనే భార్యా పుత్ర వియోగం తరువాత, రైల్వేలో చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికి గాంధీ గారి ఉద్యమాలతో ప్రేరేపితుడై సాబర్మతీ ఆశ్రమంలో చేరి, భారతీయ స్వతంత్ర పోరాటంలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
అటు పిమ్మట స్వాతంత్రానంతరం మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పిన ఆయన మద్రాసు నగరం రాజధానిగా గల ప్రత్యేక భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.
అలుపెరుగని ఆయన పోరటాలు నిరాహార దీక్షల ఫలితంగా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్త పరిచినప్పటికి అది కార్య రూపం దాల్చక పోవడంతో పొట్టి శ్రీరాములు గారు 19 అక్టోబరు 1952లో మరోమారు నిరాహార దీక్షకు పూనుకున్నారు.
57 రోజులు నిరాహార దీక్ష తరువాత 15 డిసెంబరు 1952 నాటి రాత్రి వేళ శ్రీ పొట్టి శ్రీరాములు గారు అమరులయ్యారు, నవీన భారత దేశ చరిత్రలో ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలు కోల్పోయిన రెండవ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.
ఆయన మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తెలుగు ప్రజల కోపావేశాలకు చెలరేగిన అల్లర్ల నేపధ్యంలో 4 రోజుల తరువాత 19 డిసెంబరు 1952న ప్రధాని నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు (మద్రాసు లేకుండా).
తత్ఫలితంగా 1 అక్టోబరు 1953న తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.